: వద్దురా.. తగదురా.. వదిలేయరా!...కాళ్లా వేళ్లా పడ్డా మేనత్తను వదలని 'మేయర్ దంపతుల' హంతకుడు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ లను అంతమొందించిన వ్యక్తి స్వయానా వారి మేనల్లుడు చింటూ రాయల్ (చంద్రశేఖర్) అన్న వాదన బలపడుతోంది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించకున్నప్పటికీ, నిన్న చిత్తూరు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్ద కఠారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... కఠారి దంపతులపై జరిగిన దాడి క్షణాల్లో ఏమీ ముగియలేదు. మేయర్ గదిలోకి బురఖాతో ప్రవేశించిన చింటూ, నేరుగా తన అత్త అనురాధ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో భర్త మోహన్ తో కలిసి అనురాధ పలువురు మహిళా కార్పొరేటర్లు, వారి భర్తలతో ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. బురఖా ధరించిన మరో వ్యక్తితో కలిసి గదిలోకి ప్రవేశించిన వెంటనే చింటూ తన భుజానికి ఉన్న బ్యాగులో నుంచి రివాల్వర్ తీశాడు. వారిని నిలువరించేందుకు యత్నించిన వారిని చింటూతో పాటు వెళ్లిన దుండగుడు కత్తి చూపుతూ బెదిరించాడు. నేరుగా అనురాధ వద్దకు వెళ్లిన చింటూ ఆమె తలకు తుపాకీ గురిపెట్టాడు. ఆ సమయంలో తానెవరో అనురాధకు తెలియాలన్న భావనతో చింటూ తన ముఖం కనిపించేలా బురఖా తెర తీశాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన అనురాధ తన కుర్చీ నుంచి అతడి కాళ్లపై పడేందుకు కిందకు జారారు. ‘‘వద్దురా... తగదురా... వదిలేయరా’’ అని ఆమె అతడిని ప్రాధేయపడ్డారు. అయినా ఏమాత్రం కనికరం లేకుండానే ఆమె తలకు తుపాకీ గురిపెట్టిన చింటూ రెండు రౌండ్లు కాల్చాడు. రెండు బుల్లెట్లలో ఓ బుల్లెట్ అనురాధ తలను చీల్చుకుంటూ వెళ్లగా, మరో బుల్లెట్ ఆమె తలలోనే ఉండిపోయింది. అతి సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో అనురాధ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో అప్పటికే మేల్కొన్న మోహన్, నిందితులను నిలువరించే యత్నం విఫలం కావడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మోహన్ ముందుకు వచ్చేసిన చింటూ ఆయనపైనా కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ మోహన్ కడుపులోకి చొచ్చుకెళ్లింది. నిందితులను తోసేసి బయటకు పరుగెత్తిన మోహన్ హాలులో కుప్పకూలారు. ఆ తర్వాత ఐదుగురు నిందితులు ఆయనను చుట్టుముట్టి అత్యంత కిరాతకంగా నరికేశారు. తదనంతరం నింపాదిగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.