: గజం రూ.7.20 లక్షలు!... నరసాపురంలో రికార్డు స్థాయిలో ‘రియల్’ ధరలు
భూముల ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో ఇటీవల రికార్డు విక్రయాలు నమోదయ్యాయి. తాజాగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోనూ రియల్ ధరలు రికార్డులు నమోదు చేశాయి. నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు పరిధిలోని భూమి ధరల కంటే అధికంగా పలికిన నరసాపురం ధరలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. పట్టణంలోని బులియన్ మార్కెట్ ప్రాంతంలోని 20 గజాల స్థలంలో ఉన్న ఓ దుకాణాన్ని దాని యజమాని ఏకంగా రూ. 1.40 కోట్లకు విక్రయించారు. అంటే, గజం విలువ రూ.7.20 లక్షలన్నమాట. జిల్లాలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా ఉన్న నరసాపురంలో భూమి ధరలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయని చెబుతున్న స్థానికులు, నిన్న జరిగిన ఈ విక్రయం రికార్డేనని చెబుతున్నారు. పట్టణంలో బులియన్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారే ఈ రికార్డు ధర చెల్లించి దుకాణాన్ని సొంతం చేసుకున్నారు.