: గన్ మ్యాన్ ను ‘కఠారి’ తిరస్కరించారట!
దుండగుల మెరుపు దాడిలో అసువులు బాసిన చిత్తూరు మేయర్ అనురాధ వ్యక్తిగత భద్రతా సిబ్బంది (గన్ మ్యాన్)ని తిరస్కరించారట. చిత్తూరులో టీడీపీకి కీలక నేతగా ఉన్న అనురాధ భర్త కఠారి మోహన్ సుదీర్ఘ కాలంగా వర్గ పోరు సాగిస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు (సీకే జయచంద్రారెడ్డి)తో రెండు దశాబ్దాలకు పైగా పోరు సాగిస్తున్న కఠారి మోహన్ పై గతంలో హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత మోహన్ కూడా సీకే బాబుపై హత్యాయత్నాలు చేశారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకే బాబు పటిష్టమైన భద్రతను ఏర్పరచుకున్నారు. అయితే స్వతహాగా ధైర్యస్థుడైన మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకునేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా మోహన్ భార్య అనురాధ మేయర్ గా ఎన్నికైన నేపథ్యంలో ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు ఆమెకు గన్ మ్యాన్ ను కేటాయించారు. అయితే గన్ మ్యాన్ ను ఆమె తిప్పిపంపారట. గన్ మ్యాన్ ను తీసుకుంటే ప్రత్యర్థికి భయపడినట్టవుతుందని భావించిన కారణంగానే కఠారి కుటుంబం ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతోంది. అయితే గన్ మ్యాన్ లేని నేపథ్యాన్ని ఆసరా చేసుకున్న దుండగులు పక్కాగా పథకం పన్ని కఠారి దంపతులను పొట్టనబెట్టుకున్నారు.