: ఆ కంపెనీ ముడుపుల స్వీకరణకే!...రాహుల్ గాంధీపై సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణల పర్వం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి దాడి కొనసాగుతూనే ఉంది. బ్రిటన్ లో కార్పొరేట్ కంపెనీని పెట్టిన రాహుల్ గాంధీ, అసలు భారతీయుడే కాదని స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం స్వామి ఢిల్లీలో కొన్ని పత్రాలను కూడా మీడియాకు విడుదల చేశారు. బ్రిటిష్ పౌరసత్వం కలిగిన రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడని ఆరోపించిన స్వామి, రాహుల్ ఎంపీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా బ్రిటన్ లో కార్పొరేట్ కంపెనీని ఏర్పాటు చేయాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏమిటనే కోణంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. రక్షణ రంగ సంస్థల నుంచి ముడుపులు స్వీకరించేందుకు ఉపయోగపడేలా లండన్ లో రాహుల్ గాంధీ కంపెనీని ఏర్పాటు చేశారని తాజాగా స్వామి ఆరోపణలు గుప్పించారు.