: బుల్లెట్ గాయంతో మెదడు చిట్లిపోయిందట!... చిత్తూరు మేయర్ అనురాధ పోస్టుమార్టం పూర్తి
నిన్న దుండగుల దాడిలో అసువులు బాసిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ భౌతిక కాయానికి కొద్దిసేపటి క్రితం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం ముగిసింది. నిన్న ఉదయం భర్త మోహన్ తో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన మెరుపు దాడిలో అనురాధ అక్కడికక్కడే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో గంటల తరబడి కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన ఆమె భర్త మోహన్ కూడా నిన్న రాత్రి చనిపోయారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో అనురాధ మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. ఆమె ఎడమ వైపు నుదుటి భాగంలో బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ దూసుకెళ్లిన కారణంగా ఆమె తలలోని మెదడు చిట్లిపోయింది. దీంతోనే ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక దుండగులు అనురాధపై కత్తితో దాడి చేయలేదని కూడా పోస్టుమార్టం నివేదిక చెప్పింది. అనురాధ శరీరంపై కత్తి గాట్లు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వైద్యులు ఆ నివేదికలో తెలిపారు.