: ఊహించని దాడి... వెనువెంటనే లొంగుబాటు: ‘కఠారి’పై దాడిలో క్షణాల్లో కీలక మలుపులు


చిత్తూరు జిల్లాలో టీడీపీ కీలక నేత కఠారి మోహన్, ఆయన సతీమణి, చిత్తూరు నగర మేయర్ అనురాధపై జరిగిన దాడి క్షణాల్లోనే కీలక మలుపులు తిరుగుతోంది. ఊహించని విధంగా జరిగిన దాడిలో అక్కడికి వచ్చిన నిందితులు కఠారి దంపతులపై దాడి చేసి క్షణాల్లోనే మాయమయ్యారు. ఈ దాడిలో అనురాధ అక్కడికక్కడే చనిపోగా, మోహన్ తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ మోహన్ ను ఆయన అనుచరులు హుటాహుటిన వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఓ పక్క కఠారి దంపతులను ఆసుప్రతికి తరలిస్తుండగానే, దాడికి తామే పాల్పడ్డామని ఇద్దరు నిందితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దాడిలో తాను కూడా పాల్గొన్నానని చెబుతున్న వెంకటేశ్వరరెడ్డి అనే మరో వ్యక్తి తాను కూడా లొంగిపోతానని పోలీసులతో సంప్రదింపులు నెరపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాడి జరిగిన తర్వాత పరారు కావాల్సిన నిందితులు లొంగుబాట పట్టిన వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి సాయంత్రంలోగానే ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News