: 26 యుద్ధ విమానాలు, అణు బాంబులతో సిరియా తీరాలకు చేరిన ఫ్రాన్స్ వార్ షిప్
సిరియాపై దాడులను మరింతగా పెంచేందుకు అత్యాధునిక 'చార్లెస్ డి గోల్లీ' యుద్ధ నౌకను మధ్యదరా సముద్రంలో మోహరించేందుకు పంపించామని ఫ్రాన్స్ ప్రకటించింది. తూర్పు మధ్యదరా సముద్రంలో దీన్ని నిలిపి, అక్కడి నుంచి దాడులను తీవ్రం చేస్తామని ఈ ఉదయం పారిస్ లో అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు. కాగా, ఈ విమానంపై రఫాలే సహా అన్ని రకాల యుద్ధ విమానాలు, 2 వేల నుంచి 3 వేల కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు నిలపవచ్చు. ఫలానా ప్రాంతంపై దాడి చేయాలి అంటే, రాడార్లకు దొరక్కుండా దూసుకెళ్లే క్షిపణి వ్యవస్థ ఫ్రాన్స్ దగ్గరుంది. అయితే, దీన్ని గల్ఫ్ రీజియన్ లోకి పంపకుండా, సిరియా లేదా లెబనాన్ లకు దగ్గరగా ఉంచాలని ఫ్రాన్స్ నిర్ణయించడంతో, ఐఎస్ఐఎస్ పై మరింతకాలం పాటు దాడులు జరపాలని ఆ దేశం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 26 జెట్ విమానాలను మోసుకెళ్లిన ఈ నౌకలో అణు శక్తితో నిండిన వార్ హెడ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే యూఏఈ, జోర్డాన్ తదితర ప్రాంతాల్లో ఫ్రాన్స్ 12 యుద్ధ విమానాలు నిలిపి వాటితో సిరియాపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్ ఈ తరహాలో వైమానిక దాడులు జరపడం ఇదే తొలిసారి.