: ఐఎస్ఐఎస్ విషయంలో 'నొప్పింపక తానొవ్వక' అన్నట్టుగా పెద్దన్న!
ఏదైనా తనదాకా వస్తేనే తెలుస్తుందన్నట్టు... అమెరికాపై లాడెన్ దాడి తరువాత పనిగట్టుకుని ఆఫ్గనిస్థాన్ నాశనానికి కదిలిన అమెరికా, ఫ్రాన్స్ పై జరిగిన ఉగ్రదాడిపై ఆచితూచి స్పందిస్తోంది. ఇస్లామిక్ రాజ్యాన్ని అంతమొందించడం, ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడారు. సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో స్థానిక భద్రతా బలగాలకు తాము ఎప్పటి నుంచో సాయపడుతున్నామని, ఇకపైనా అలాగే చేస్తామని అన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగబోమని, అమెరికాలోకి శరణార్థులుగా వస్తున్న ముస్లింలను కూడా అడ్డుకోబోమని అన్నారు. మలేషియా, ఫిలిప్పైన్స్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఫ్రాన్స్ దాడులను రాజకీయంగా వాడుకోవాలని విపక్షాలు చూస్తున్నాయని, అమెరికా సరైన వ్యూహంలోనే వెళుతోందని, అది చాలా కఠినమైనదని అన్నారు. అమెరికాకు ఆర్థిక నష్టం కలిగించే నిర్ణయాలకు తాను దూరమని, ఇదే సమయంలో అమెరికా ఓ బలమైన దేశంగా ప్రపంచానికి కనిపించాలన్నదే తన అభిమతమని అన్నారు. సిరియా నుంచి వస్తున్న శరణార్థులను నిలువరించాలని, వారి వల్లనే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. "సిరియాలో మారణహోమం జరుగుతోంది. ఎంతో మంది బాధితులు ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు వస్తున్నారు. వారిని చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. అటువంటి వారికి సాయం చేయాలా? వద్దా? బాధితులను, ఉగ్రవాదులనూ ఒకే గాటన కట్టలేం" అని ఒబామా వ్యాఖ్యానించారు. "క్రిస్టియన్ శరణార్థులను మరింత జాగ్రత్తగా పరిశీలించాలి" అని ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "నా తరువాత ఈ స్థానంలో కూర్చోవాలనుకుంటున్న ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు. మన మూలాలపైనే మత పరీక్షలు చేయాలని అడుగుతారా? అది మన విధానమే కాదు" అని నిప్పులు చెరిగారు. ఒబామా మాటలు విన్న తరువాత, అమెరికాపై ఉగ్రదాడి జరిగితే తప్ప కఠిన నిర్ణయాలు తీసుకోలేరా? అని ప్రశ్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం.