: వరద నీటిలో వోల్వో బస్సు... సాయం కోసం 40 మంది ప్రయాణికుల ఎదురుచూపు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షం చిత్తూరు జిల్లాతో పాటు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాను కూడా అతలాకుతలం చేస్తోంది. రోజుల తరబడి కురుస్తున్న వర్షం కారణంగా నెల్లూరు జిల్లాలోని జలాశయాలన్నీ పొంగి పొరలుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పెను విలయం చోటుచేసుకుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలోని గూడూరు మండలంలో చెన్నై-కోల్ కతా జాతీయ రహదారికి గండి పడింది. దీంతో ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గుంటూరు నుంచి తిరుపతికి బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు మరో మార్గం మీదుగా వెళ్లేందుకు యత్నించి ప్రమాదంలో చిక్కుకుంది. 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ప్రస్తుతం గూడురు మండలంలోని చైతన్య ఆర్ట్స్ కళాశాల సమీపంలో వరద నీటిలో చిక్కుకుంది. దీంతో బస్సు నుంచి దిగేందుకు యత్నించిన ప్రయాణికులు కింద వరద నీరు పోటెత్తుతుండటంతో తమ యత్నాన్ని విరమించుకున్నారు. పోలీసులు, సహాయక బృందాలను సంప్రదించేందుకు వారు చేసిన యత్నాలు మొబైల్ సిగ్నల్స్ లేక విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంతో కాలు కింద పెట్టలేక ప్రయాణికులంతా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో తమను కాపాడాలని బస్సులో నుంచే వారు పెద్దగా కేకలు వేస్తున్నారు.