: ఏపీ సీఆర్డీఏలో అవినీతి అధికారి... వల పన్ని పట్టేసిన ఏసీబీ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ‘కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటి (సీఆర్డీఏ)’కి ఆదిలోనే అవినీతి మకిలి అంటింది. ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టి, నవ్యాంధ్ర రాజధానికి విశ్వవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఆర్డీఏలో ఏడీఎం (ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మన్)గా పనిచేస్తున్న బట్లంకి సాయికుమార్, అక్రమ కట్టడానికి అనుమతి ఇప్పించే విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకెళితే... సీఆర్డీఏ పరిధిలోని గుడివాడ కార్పొరేషన్ కు చెందిన పరుచూరి వెంకట మధుసూదనరావు తన భార్య పేరిట రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే మరో రెండు అంతస్తుల మేర శ్లాబ్ వేశారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన పీనలైజేషన్ కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రంగంలోకి దిగిన సాయికుమార్ బీపీఎస్ కింద దరఖాస్తును ఆమోదింపజేస్తానని, అందుకు తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సాయికుమార్ తో బేరసారాలు చేసిన మధుసూదనరావు రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత విషయాన్ని ఆయన నేరుగా ఏసీబీ అధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విజయవాడలోని కపర్థి థియేటర్ కార్ పార్కింగ్ ప్రాంతంలో డబ్బు తీసుకుంటున్న సాయికుమార్ ను అరెస్ట్ చేశారు.