: బాక్సైట్ జీవో చంద్రబాబుకు తెలియకుండానే వచ్చేసిందట!... అధికారులపై ఏపీ సీఎం ఆగ్రహం


ఏపీలోని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో పెను సంచలనాలకు తెర తీసింది. విపక్షాలతో పాటు నిషేధిత మావోయిస్టుల దాకా ఈ జీవోపై నిరసన వ్యక్తం చేశాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల నుంచి బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ జీవో అసలు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గాని, రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి గానీ తెలియకుండానే జారీ అయ్యిందట. ఈ విషయంపై నిన్న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పెద్ద చర్చే జరిగింది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని లేవనెత్తుతూ జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. అంతేకాక అధికారుల దుందుడుకు వైఖరిపై చూచాయగా సమాచారం ఉన్న గంటా దీనిపై సీఎంను ఆరా తీశారు. ఈ జీవో వస్తున్నట్లు ముందుగా తనకు అసలు సమాచారమే లేదని చంద్రబాబు చెప్పారు. ఆ వెంటనే అక్కడే ఉన్న బొజ్జలను కూడా గంటా ఇదే ప్రశ్న వేశారు. బొజ్జల కూడా చంద్రబాబు తరహాలోనే సమాధానమిచ్చారు. దీంతో వెనువెంటనే స్పందించిన చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ అంశంపై కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఏపీ అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఆదేశాలు జారీ చేసి ఉంటారని పేర్కొన్నారు. అయినా ఇంతటి ప్రాధాన్యం కలిగిన విషయంలో ప్రభుత్వ పెద్దలకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా ముందుకెళతారని ఆయన అధికారులను నిలదీశారు. ఇకపై ఇలాంటి తప్పులు దొర్లితే సహించేది లేదని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. సుదీర్ఘ చర్చ తర్వాత బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు కేబినెట్ తీర్మానించింది.

  • Loading...

More Telugu News