: ఆ కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది!
హర్యానాలోని ఒక చిన్న షాపుకు కరెంటు బిల్లు ఎంతొచ్చిందో చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే, ఆ బిల్లు కోట్ల రూపాయల్లో ఉంది. ఈ సంఘటన ఫరీనాబాద్ నగరంలో ఉన్న ఒక చిన్న టైర్ల రిపేర్ షాపు విషయంలో చోటు చేసుకుంది. ఆ షాపు నిర్వహించే సురేందర్ కి సుమారు రూ.77.89 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో సురేందర్, అతని తల్లి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, అతని తల్లి షాక్ కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయింది. ‘ఒక ఫ్యాన్, ఒక లైట్ తప్పా ఇతర విద్యుత్ పరికరాలేవీ మా దుకాణంలో లేవు. సాధారణంగా రెండు వేల రూపాయలకు మించి బిల్లు రాదు. మరి, ఇంత బిల్లు ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు. అక్టోబర్ 31 వ తేదీన విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ బిల్లు ఇచ్చారు’ అని బాధితుడు సురేందర్ పేర్కొన్నాడు. కాగా, హర్యానాలో ఇటువంటి సంఘటనలు సాధారణమేనని స్థానికులు అంటున్నారు. గతంలో ఒక పాన్ షాపునకు సుమారు రూ.132 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చిందన్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖాధికారులు మాట్లాడుతూ, కంప్యూటర్ తప్పిదం కారణంగానే ఇంత భారీ మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చిందన్నారు.