: నీళ్లల్లో పడ్డా చెక్కుచెదరని ‘ఆపిల్’ స్మార్ట్ ఫోన్!
నీళ్లల్లో పడ్డా చెక్కు చెదరని సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆపిల్ సంస్థ తయారు చేయనుంది. అయితే, వేరే కంపెనీలకు చెందిన ఈ తరహా ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అయినప్పటికీ, ఆపిల్ సంస్థ తయారు చేయబోయే ఫోన్ వీటన్నింటికీ భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లోకి నీరు చేరిందా? లేదా? అనే విషయాన్ని ముందుగా గుర్తించేందుకు కొన్ని సెన్సర్లు పనిచేస్తాయి. ఒకవేళ ఫోన్ లో నీరు ఉంటే కనుక బ్యాటరీ నుంచి చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ ప్రసారమవుతుంది. నీరు మొత్తం స్పీకర్లు, మైక్రోఫోన్ పోర్టుల ద్వారా బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. ఈ సరికొత్త టెక్నాలజీకి పేటెంట్ కోసం ఆ సంస్థ ఇటీవలే దరఖాస్తు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ స్పీకర్లపై వల లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఈ ఫోన్లు తయారు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని, తాము తయారు చేయబోయే ఈ ఫోన్ పూర్తి స్థాయి హైటెక్ అని ఆపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.