: టి.న్యూస్, నమస్తే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా వార్తలొస్తున్నాయి: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వరంగల్ అభ్యర్థికి మద్దతుగా టి.న్యూస్ లోను, నమస్తే తెలంగాణ పత్రికలోను వార్తలను ఇచ్చుకుంటున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తూ అధికారపార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి అభ్యర్థికి మద్దతుగా టి.న్యూస్, నమస్తే తెలంగాణలో వస్తున్న వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. 'నమస్తే తెలంగాణ' వార్తా పత్రిక కాదని, దానిని తాము కరపత్రంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి పరిమితి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, వెంటనే అతడిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దానిపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు వరంగల్ రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు రేవంత్ తెలిపారు.