: ఫీడ్ బ్యాక్ టైం!... ‘దిశానిర్దేశం’లో పార్టీ స్థితిగతులపై చంద్రబాబు ఆరా!
ఏపీలో అధికార పార్టీ టీడీపీ ‘దిశానిర్దేశం’ సదస్సులో భాగంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న భవిష్యత్తు లక్ష్యాలను పార్టీ నేతలకు ఉద్బోధించారు. నిన్న రాత్రి తిరుపతిలోనే బస చేసిన చంద్రబాబు రెండో రోజు సదస్సుల్లో భాగంగా నేటి ఉదయం ‘ఫీడ్ బ్యాక్’పై దృష్టి సారించారు. జిల్లాల వారీగా పార్టీ నేతలను వేర్వేరుగా పిలిపించుకుంటున్న చంద్రబాబు ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాక, ఆయా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయంపైన, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుపైన చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వద్ద ఆయా జిల్లాల పార్టీ నేతలు సరికొత్త సమస్యలను ఏకరువు పెడుతున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న సమస్యలను కూడా ఆయన ముందు ప్రస్తావిస్తున్నారట. సదరు సమస్యల పరిష్కారంపై సూచనలు చేస్తూనే పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ తరహా భేటీలు నేటి సాయంత్రం దాకా కొనసాగే అవకాశాలున్నాయి.