: మిస్డ్ కాల్ తో సిరిసిల్ల అనిల్ తో పరిచయం... చంటిబిడ్డతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన సన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో పోలీసులు మరింత కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కొడుకు (సారిక భర్త) అనిల్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. ఇక ఈ కేసులో ఏ4 నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో ఆమెను కూడా రిమాండ్ కు తరలించారు. సనతో పరిచయం ఏర్పడే దాకా అనిల్ తన భార్య సారికను బాగానే చూసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అసలు సనతో అనిల్ కు ఎలా పరియమైందన్న కోణాన్ని కూడా పోలీసులు నిగ్గు తేల్చారు. కాజీపేటలోని ఫాతిమానగర్ లో బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్న సనకు అనిల్ తో తొలుత ఓ మిస్డ్ కాల్ తోనే పరిచయమైందట. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ఆ తర్వాత ప్రేమగా, తదనంతరం పెళ్లిగా రూపాంతరం చెందింది. పెళ్లి చేసుకున్న అనిల్, సన ఆ తర్వాత తమ మకాంను సికింద్రాబాదుకు మార్చారు. తొలి సంతానం కలిగే దాకా అనిల్ సిరిసిల్ల రాజయ్య కుమారుడని కానీ, అతడికి అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం కానీ సనకు తెలియదట. తొలి కాన్పు తర్వాత విషయం తెలుసుకున్న సన, అనిల్ ను నిలదీసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. తదనంతర కాలంలో సారికతోనూ సన పలుమార్లు గొడవ పడిందని పోలీసులు చెబుతున్నారు. చివరకు అనిల్ తో విడిపోయేందుకు సిరిసిల్ల కుటుంబం రూ.10 లక్షలను సనకు ఆపర్ చేసింది. దీనికి సన కూడా సమ్మతించిందని సమాచారం. అయితే ఈ లావాదేవీలో జాప్యం జరగడం, అంతలోగానే సారిక పిల్లలతో సహా సజీవ దహనం కావడంతో సన చిక్కుల్లో పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే పరారైన సన, ఖమ్మంలో తలదాచుకున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే ఓ మధ్యవర్తి సహాయంతో సన తమ ఎదుట లొంగిపోయిందని నిన్న కోర్టుకు వరంగల్ పోలీసులు చెప్పారు. స్టేషన్ కు వచ్చిన సమయంలో సన చంకన ఆమె చిన్నారి కొడుకు కూడా ఉన్నాడు.