: చైన్ స్నాచర్ కు పోలీస్ బైకిచ్చిన ఖాకీ... జైల్లో పలుమార్లు ములాఖత్
తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఏఎస్సైగా పనిచేస్తూనే మోహన్ రెడ్డి అనే ఖాకీ... వడ్డీ దందాతో పెను సంచలనానికి తెర తీస్తే, హైదరాబాదులో మోహన్ అనే కానిస్టేబుల్ ఏకంగా చైన్ స్నాచర్ తో దోస్తీ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇటీవల మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసిన చైన్ స్నాచర్ మహ్మద్ తో నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మోహన్ దోస్తీ చేశాడట. అంతేకాదు, మోహన్ కు పోలీసు శాఖ ఇచ్చిన బైకునే మహ్మద్ తన స్నాచింగ్ లకు వినియోగించాడట. ఇక అరెస్టై జైల్లో ఉన్న మహ్మద్ తో నాలుగైదు సార్లు ములాఖత్ అయిన మోహన్, అతడిని బయటకు రప్పించేందుకు ఏకంగా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేశాడట. ఈ క్రమంలో విడుదలైన మహ్మద్ వద్ద నజరానాగా రూ.1.90 లక్షల విలువ చేసే నగలను మోహన్ తీసుకున్నాడు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు లభించడంతో మోహన్ ను విధుల నుంచి తప్పించిన పోలీసు బాసులు ఆయనను వీఆర్ లో పెట్టారు. స్నాచర్ కు పోలీసు బైకివ్వడం, జైల్లో ములాఖత్ విషయం రూఢీ అయితే మోహన్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.