: కేరళలో కాంగ్రెస్ నాయకురాలిపై దాడి చేసి జుట్టు కత్తిరించారు!
కేరళలో మహిళా కాంగ్రెస్ నాయకురాలి జుట్టును ప్రత్యర్థులు బలవంతంగా కత్తిరించారు. ఈ సంఘటన తిరువనంతపురం జిల్లాలోని పెరుంకడవిలా పంచాయతీ పరిధిలో జరిగింది. ఇటీవల పెరుంకడవిలా పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిపై మహిళా కాంగ్రెస్ నాయకురాలు సతికుమారి (50) పోటీ చేసి ఓటమి పాలైంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో అమరవిలా వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టును బలవంతంగా కత్తిరించారు. బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మండిపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపై కమ్యూనిస్టు పార్టీలు దాడులకు పాల్పడుతున్నాయని, విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారని, అందుకు ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.