: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు, మరోవైపు యూఎస్ ఫెడ్ భయం, దేశంలో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న సంకేతాలతో సెషన్ ఆరంభంలోనే నష్టాల్లోకి దిగజారిన సూచికలు, మరే దశలోనూ కోలుకోలేకపోయాయి. దీంతో భారీ నష్టం నమోదైంది. శుక్రవారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 256.42 పాయింట్లు పడిపోయి 0.99 శాతం నష్టంతో 25,610.53 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 62.75 పాయింట్లు పడిపోయి 0.80 శాతం నష్టంతో 7,762.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.37 శాతం, స్మాల్ క్యాప్ 0.76 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, పీఎన్బీ తదితర కంపెనీలు లాభపడగా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, కెయిర్న్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐడియా తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96,09,923 కోట్లకు తగ్గింది. మొత్తం 2,744 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 934 కంపెనీలు లాభాలను, 1,659 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.