: సంచలనం సృష్టిస్తున్న యువతి యథార్థ గాధ!
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశాల్లో ఉగ్రవాదం ఓ వైపున ఉంటే, పర్యావరణం, హ్యూమన్ ట్రాఫికింగ్ మరోవైపున ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అమాయకులైన వారిని నయానో, భయానో లేదా బలవంతంగానో తీసుకువెళ్లి తమ అవసరాలు తీర్చుకుంటున్న ముఠాలు లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. అది మగవారైనా, మహిళలైనా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ రూపంలో జరిగినా అడ్డుకుంటామని చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయేగానీ, ఆచరణలో ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఓ 23 ఏళ్ల యువతి తాను హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎలా బలై చిత్రహింసలు అనుభవించానన్న విషయాన్ని, ఆపై ఎలా బయటపడ్డానన్న సంగతిని సీఎన్ఎన్ తో పంచుకుంటే, ఆ కథ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే... మెక్సికోకు చెందిన కార్లా జాసింటో అనే 12 ఏళ్ల బాలికను 2004లో కొందరు బహుమతులు, డబ్బు, ఖరీదైన కార్లు ఇస్తామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఆపై ముక్కుపచ్చలారని ఆ బాలికకు నరకం కనిపించింది. వ్యభిచార గృహాలకు ఆమెను అప్పగించారు. నాలుగేళ్ల పాటు రోజుకు 30 మంది కామవాంఛలు తీర్చుకునే ఆట బొమ్మగా మిగిలింది. తన చిన్ననాటి సంఘటనలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకున్న కార్లా, "నాకు 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకూ ఏం జరిగిందన్నది చెప్పినా నమ్మరు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ మృగాళ్ల చేతుల్లో నలిగిపోయాను. నేను ఏడుస్తుంటే కొంతమంది నవ్వుతుండేవారు. ఆ సమయంలో నేను కళ్లు మూసుకుని శవంలా ఉండేదాన్ని. నా శరీరానికి ఏం జరుగుతుందో కూడా చూసుకునేదాన్ని కాదు. అందువల్ల నాలో ఏ అనుభూతీ ఉండేది కాదు. నన్ను 43,200 మంది అనుభవించారు" అని కార్లా సీఎన్ఎన్ కు వెల్లడించింది. ఓ హోటల్ పై 2008లో యాంటీ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు జరపడంతో ఓ గదిలో ఉన్న కార్లా బయటపడగలిగింది. దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన ఈ యథార్థ గాధను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రచురించడంతో కార్లా కథ బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆనందంగానే ఉన్నా, ఈ ప్రపంచంలో కార్లా వంటి యువతులు ఎందరెందరో నాలుగ్గోడల మధ్య జీవచ్ఛవాలుగా నలుగుతూనే ఉన్నారు.