: ఈసారి బాబా రాందేవ్ వంతు!... ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు యోగా శిక్షణ
ఆమధ్య ప్రముఖ ఆధ్మాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధ్యాన యోగలో శిక్షణనిచ్చారు. మూడు రోజుల పాటు హైదరాబాదులో జరిగిన ఈ శిక్షణా తరగతులకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా స్వయంగా హాజరై చక్కగా ధ్యాన యోగలో తర్ఫీదు తీసుకున్నారు. ఈ ప్రయోగం బాగానే పనిచేసినట్లుంది. తాజాగా ఏపీ ప్రజా ప్రతినిధులకు యోగాలో శిక్షణ ఇప్పించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఈ యోగా శిక్షణా తరగతుల బాధ్యతలను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు అప్పగించారట. డిసెంబర్ 20న ఈ శిక్షణా తరగతులు విజయవాడ శివారులోని హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో జరగనున్నాయి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు హాయ్ ల్యాండ్ లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఓ రోజు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయి.