: జీహాదీ జాన్ మరణించాడా? తప్పించుకున్నాడా?
తమకు పట్టుబడిన పాశ్చాత్య దేశాలకు చెందిన బందీలను అత్యంత క్రూరంగా హింసించి చంపుతూ, ఆ వైనాన్ని వీడియోలు తీసి బ్రిటన్ వ్యవహారిక భాషలో హెచ్చరికలు జారీ చేస్తూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న జీహాదీ జాన్ అలియాస్ మహమ్మద్ ఎమ్ వాజీ మరణించాడా? తప్పించుకున్నాడా? ప్రస్తుతానికి అమెరికా పెంటగాన్ వర్గాలకు సమాధానం తెలియని ప్రశ్న ఇది. జీహాదీ జాన్ అనుపానులపై సమాచారం అందుకున్న యూఎస్ సైన్యం సిరియాలోని రఖ్కాపై విమానాలతో దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతమయ్యాయా? లేదా? అన్నది ఇంకా తెలియలేదని, అయితే జాన్ ఉన్న స్థావరంపై బాంబులు పడ్డాయని ఓ యూఎస్ అధికారి వివరించారు. మరింత సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. కాగా, యూఎస్ జర్నలిస్టులు స్టీవెన్ సాట్ లాఫ్, జేమ్స్ తో పాటు అబ్దుల్ రెహమాన్ ఖాసింగ్, బ్రిటన్ కు చెందిన డేవిడ్ హైన్స్, అలన్ హెన్నింగ్, జపాన్ కు చెందిన కెంజీ గొటో తదితరులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బంధించగా, వారిని అత్యంత క్రూరంగా హతమార్చింది జీహాదీ జానే. ఇతని కోసం అమెరికా వేటను కొనసాగిస్తూనే ఉంది. కువైట్ లో జన్మించిన జాన్ కు బ్రిటన్ పాస్ పోర్టు కూడా ఉంది. గత జూలై నాటికి అతను బతికే ఉన్నాడని రఖ్కా సమీపంలో నివసిస్తున్నాడని సీఎన్ఎన్ ప్రకటించింది. ఆపై అతనెక్కడా కనిపించలేదని సమాచారం.