: విద్యార్థిని ముద్దుపెట్టుకున్న క్లర్క్ కు పదేళ్ల జైలు!... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు


అతడో పాఠశాలలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికను విచక్షణ మరచి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఇంకేముంది, పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానాకు గురయ్యాడు. హైదరాబాదులోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు నిన్న సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకెళితే... నగరంలోని అమీర్ పేట పరిధిలోని వెంగళరావునగర్ లోని నలంద పాఠశాలలో హరగోపాల్ అనే వ్యక్తి క్లర్కుగా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. వెనువెంటనే బాలిక తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హరగోపాల్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 376, ఫోక్స్ యాక్ట్ కింద పోలీసులు హరగోపాల్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో సుదీర్ఘంగా సాగింది. బాధితురాలి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవలే ఈ కేసులో వాదనలు ముగియగా, సిటీ సివిల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితుడిని దోషిగా నిర్ధారించారు. పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నిన్న సంచలన తీర్పు చెప్పారు.

  • Loading...

More Telugu News