: మా దగ్గర అపారమైన వనరులున్నాయి...మీ దగ్గర డబ్బు, సామర్థ్యం ఉన్నాయి!: మోదీ
భారత్, బ్రిటన్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బ్రిటన్ ప్రధాని జేమ్స్ కేమరాన్ తో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని అన్నారు. వీటిని మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాలు నడుం బిగించాయని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొనేందుకు బ్రిటన్ ప్రధాని జేమ్స్ కేమరాన్ చేసిన కృషి విశేషమైనది ఆయన చెప్పారు. బ్రిటన్ పర్యటనకు వచ్చిన తనకు లభించిన స్వాగతం అద్వితీయమైనదని ఆయన పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు తనకు లభించిన ఆదరణే నిదర్శనమని ఆయన చెప్పారు. తనను ఇంత ఆదరించిన కేమెరాన్ కు ధన్యవాదాలని ఆయన చెప్పారు. అలాగే భారత్, బ్రిటన్ మధ్య నెలకొన్న సంబంధాలు విశిష్టమైనవని ఆయన చెప్పారు. రెండు దేశాల్లోని ప్రభుత్వాల మధ్య పరస్పర విశ్వాసం, పరస్పర సహకారం ఉన్నాయని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రేడ్ ఇన్వెస్టిమెంట్, డిఫెన్స్, విద్య, విద్యుత్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. భారత్ లో అపారమైన వనరులున్నాయని ఆయన చెప్పారు. వాటిని సద్వినియోగం చేయగల ఆర్థిక వనరులు, సామర్థ్యం బ్రిటన్ కు ఉన్నాయని, భారత్ లో అవకాశాలను బ్రిటన్ కైవసం చేసుకుని పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియాలో బ్రిటన్ ప్రధాన భాగం కావాలని ఆయన సూచించారు. అలాగే తాజాగా, రెండు దేశాలు సివిల్, న్యూక్లియర్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. కాలుష్య నిరోధంపై రెండు దేశాలు దృష్టి సారించాయని ఆయన తెలిపారు.