: ఈ రెండు రికార్డులు సరే...ఆ రికార్డుకు కూడా నేనే అర్హుడిని!: జాకీ చాన్
జాకీ చాన్ అంటే తెలియని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాంటి జాకీ చాన్ రెండు సరికొత్త రికార్డులు సృష్టించాడు. రెండు రికార్డులు సాధించినందుకు జన్మధన్యమైందని జాకీచాన్ పేర్కొన్నాడు. 2012లో జాకీ చాన్ 'చైనీస్ జోడియాక్' పేరిట ఓ సినిమా రూపొందించాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, నిర్మాత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చీఫ్, దర్శకుడు, రచయిత, ఫైట్స్ కంపోజర్, ఫైట్ సీన్స్ లో డూప్, సంగీత దర్శకుడు, థీమ్ సాంగ్ సింగర్, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్టెమెంట్ లో ప్రాపర్టీస్ ఇన్ఛార్జ్, కెమెరా డిపార్ట్ మెంట్ లో లైటింగ్ చీఫ్, కేటరింగ్ డిపార్ట్ మెంట్లో కో ఆర్డినేటర్ ఇలా మొత్తం 15 శాఖల్లో పని చేసిన ఏకైక వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల కెక్కారు. ఇదే సినిమాలో అత్యంత రిస్క్ యాక్షన్స్ రూపొందించిన స్టంట్ మేన్ గా మరో రికార్డు సృష్టించాడు. గతంలో ఒక సినిమాలో 11 శాఖల్లో పని చేసి రాబర్ట్ రోడ్రిగ్స్ రికార్డు పుటలకెక్కగా, దానిని జాకీ చాన్ తిరగరాశాడు. ఇకపోతే జాకీ చాన్ చేసిన సినిమాల ద్వారా శరీరంలో గాయపడని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నోసార్లు చావు అంచులను తాకివచ్చిన జాకీ చాన్ కు సినిమా యాక్షన్ సీన్స్ లో నటించడమంటే ఇష్టం. ఆయన ముక్కుకు మూడుసార్లు ఆపరేషన్ జరిగింది, ఏకంగా పుర్రె పగిలిన హీరో జాకీ చాన్ ఒక్కడే. బుగ్గ ఎముకలు, పక్కటెముకలు ఇలా శరీరంలో చాలా భాగాలు సర్జరీలకు గురయ్యాయి. ప్రధానంగా ఆయన చేతి వేళ్లు, ఎన్నిసార్లు విరిగాయో లెక్కేలేదు. మరి ఈ విభాగంలో కూడా రికార్డులుంటే తనకే వస్తాయని జాకీ చాన్ నమ్మకంగా చెబుతున్నాడు.