: నన్ను తీర్చిదిద్దినవి ఆటలే!: సౌతాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్
తనను ఇంతలా తీర్చిదిద్దినవి క్రీడలేనని సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తెలిపాడు. బెంగళూరులో ఏబీ మాట్లాడుతూ, తనకు రగ్బీ, ఫుట్ బాల్, హాకీ, బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రావీణ్యం ఉందని చెప్పాడు. క్రీడా కుటుంబం నుంచి వచ్చినందున తనకు క్రీడలపై మక్కువ పెరిగిందని తెలిపాడు. తన అన్నలు ఏ ఆట ఆడితే అది ఆడేవాడినని, ఫలానా ఆట ఆడు అని తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిర్దేశించలేదని, తన ఇష్టానికే వదిలేశారని, ప్రతి ఆటలోనూ ప్రోత్సహించారని ఏబీ చెప్పాడు. పలు క్రీడల్లో ప్రవేశం ఉండడం వల్లే క్రికెట్ లో ప్రావీణ్యం సంపాదించానని డివిలియర్స్ పేర్కొన్నాడు. శనివారం ప్రారంభం కానున్న టెస్టు అతనికి వందవ టెస్టు. మరి, ఈ ల్యాండ్ మార్క్ టెస్టులో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే ఆసక్తి నెలకొంది.