: ఢిల్లీ టెస్టుపై కేజ్రీవాల్ ఎఫెక్ట్... మ్యాచ్ జరగడం అనుమానమే!
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో డిసెంబర్ 3 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య సిరీస్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం పడనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని కేజ్రీవాల్ నియమించారు. 48 గంటల్లో ప్రాథమిక నివేదికను సమర్పించాలని ఈ బృందాన్ని కేజ్రీవాల్ ఆదేశించారు. డీడీసీఏలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఫిర్యాదులు అందిన కొన్ని రోజుల్లోనే కేజ్రీవాల్ విచారణకు ఆదేశించారు. వినోదపు పన్ను నుంచి తప్పించుకునేందుకు టికెట్ల విలువని తక్కువ చేసి చూపారనే ఆరోపణలతో ఢిల్లీ ప్రభుత్వం డీడీసీఏకు రూ. 24 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తో ఈ విషయానికి సంబంధించిన సమస్యను డీడీసీఏ పరిష్కరించుకోలేదు. మరోవైపు, ఫైన్ మొత్తాన్ని చెల్లిస్తేనే టెస్ట్ మ్యాచ్ కు క్లియరెన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో, డీడీసీఏ ప్రతినిధి మాట్లాడుతూ, మ్యాచ్ సజావుగా జరిగేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహకారాన్ని అర్థిస్తామని చెప్పారు. ఈ క్రమంలో, చివరి మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు, ఢిల్లీ రంజీ కెప్టెన్ గౌతం గంభీర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో ఇప్పటికే భేటీ అయి, సమస్యపై చర్చించాడు.