: ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే బీజేపీ దెబ్బతినడం ఖాయం: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో పవన్ చెప్పిన మాటల్లో కూడా ఇదే భావం కనిపించింది. ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో వేటినీ నెరవేర్చనప్పుడు బీజేపీ దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ కచ్చితంగా కేంద్రం నిధులు ఇచ్చి తీరాలని ఆయన స్పష్టం చేశారు. వాళ్లిచ్చిన మాట వెనక్కి తీసుకుంటే బీజేపీ నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలకు నష్టం జరిగినా, అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోనన్నారు. ఇటీవల అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని, అందుకే వేచి చూస్తున్నానని పవన్ అన్నారు. అలాగని రోడ్లపైకి వచ్చి, ఆందోళన చేస్తే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఏ సమస్యనైనా వ్యవస్థాగతంగా చర్చిస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీని విస్తరించడానికి తనకు తగిన ఆర్థిక స్థోమత లేదని పవన్ ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదని చెప్పారు. తమ భేటీలో ఆ అంశం అసలు ప్రస్తావనకు రాలేదన్నారు.