: హాజెల్ కీచ్ తో యువరాజ్ ఎంగేజ్ మెంట్... దీపావళి రోజున బాలిలో ఒక్కటైన జంట
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ప్రియురాలు హాజెల్ కీచ్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఇందులో భాగంగా తొలి ఘట్టమైన ఎంగేజ్ మెంట్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న పూర్తయింది. గుట్టుచప్పుడు కాకుండా ఇండోనేసియా నగరం బాలి వెళ్లిన ఈ జంట ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కొంతకాలంగా హాజెల్ తో డేటింగ్ చేస్తున్న యువరాజ్ సింగ్, ఇటీవల హర్భజన్ సింగ్ తో జరిపిన చాటింగ్ లో హాజెల్ తో ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. అంతేకాక హాజెల్ తో కలిసి యువరాజ్ సింగ్ ఢిల్లీలో జరిగిన భజ్జీ, గీతా బస్రాల రిసెప్షన్ కు వెళ్లాడు. రెండు రోజుల క్రితం హాజెల్ తో యువరాజ్ సింగ్ డేటింగ్ పై అతడి తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాజెల్ ను పెళ్లి చేసుకుంటే యువరాజ్ కు టీమిండియాలో చోటు దక్కే అవకాశముందని యోగ్ రాజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో యువరాజ్ ఏకంగా హాజెల్ తో ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు.