: రష్యా ఇక ఒలింపిక్స్ ఆడటం కష్టమే!
రష్యా ప్రభుత్వమే దగ్గరుండి అథ్లెట్లతో డోపింగ్ చేయిస్తున్నదని వాడా స్వతంత్ర కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, మొత్తం ఆ దేశంపైనే నిషేధం విధించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ దిశగా సాధ్యమైనంత త్వరలో ఒలింపిక్ సంఘం రష్యాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఒలింపిక్స్ లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం పడితే, మిగతా అన్ని అంతర్జాతీయ పోటీలకు ఆ దేశం దూరం కాక తప్పకపోవచ్చు. లండన్ ఒలింపిక్స్ సహా, పలు టోర్నీలకు వచ్చిన ఆటగాళ్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారని, వీరిలో చాలా మందికి పతకాలు కూడా వచ్చాయని వాడా కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఫెడరేషన్ అధికారులకు కూడా ఇందులో సంబంధముందని కమిషన్ వెల్లడించింది. కాగా, రేపు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్యల సంఘం సమావేశమై మొత్తం విషయంపై చర్చించనుంది. ఆపై మొనాకోలో జరిగే మీటింగ్ లో రష్యాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడవచ్చని తెలుస్తోంది. మరోవైపు రష్యాను ఒలింపిక్స్ నుంచి దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.