: హూస్టన్ లో చెలరేగిన ‘వారియర్స్’... సచిన్ బ్లాస్టర్స్ టార్గెట్ 263
ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో భాగంగా అమెరికా నగరం హూస్టన్ లో జరుగుతున్న రెండో టీ20లో వార్న్ వారియర్స్ బ్యాట్స్ మన్ వీరవిహారం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలోనే 262 పరుగులు చేసి ప్రత్యర్థి సచిన్ బ్లాస్టర్స్ కు 263 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. నేటి ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన సచిన్ బ్లాస్టర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన వార్న్ వారియర్స్ ఆరంభం నుంచే చెలరేగారు. వార్న్ ఓపెనర్లు హెడెన్ (32), వాన్ (30) శుభారంభాన్నివ్వగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కలిస్ (41), పాంటింగ్ (40) కూడా బ్యాట్లను ఝుళిపించారు. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక స్టార్ కుమార్ సంగక్కర (70) బ్లాస్టర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. చివరాఖరులో సైమండ్స్ (19), జాంటీ రోడ్స్ (18)కూడా తక్కువ బంతుల్లోనే వేంగంగా పరుగులు రాబట్టారు. వెరసి నిర్ణీత 20 ఓవర్లలోనే వార్న్ వారియర్స్ 262 పరుగులు చేసింది. మరికాసేపట్లో సచిన్ బ్లాస్టర్ 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది.