: గుర్గావ్ లో కాల్పుల కలకలం... రియల్టర్ ను కాల్చి చంపిన దుండగులు
దేశ రాజధాని సమీపంలో నిన్న రాత్రి మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పెట్రోల్ పంపు యజమానికి గిఫ్ట్ లు ఇచ్చేందుకు వెళ్లిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గుర్గావ్ లోని సెక్టార్-5 లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ పంపులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకెళితే... గుర్గావ్ లో నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు కుమార్ (32) నిన్న రాత్రి తన ఇంటికి సమీపంలోని పెట్రోల్ పంపు యజమానికి దీపావళి గిఫ్ట్ లు ఇచ్చేందుకు వెళ్లారు. పెట్రోల్ పంపు ఆవరణలోకి రాజు కుమార్ కారు ఎంటర్ కాగానే రెండు బైకులపై వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు తమ వెంట తెచ్చుకున్న పిస్టళ్లతో ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజు కుమార్ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇదిలా ఉంటే, వ్యాపారంలో భాగంగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని రాజు కుమార్ గుర్గావ్ పోలీసులకు అంతకుముందే ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.