: డిసెంబర్ లోనే భారత్-పాక్ సిరీస్... అనుమతి కోసం కేంద్రానికి బీసీసీఐ లేఖ


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు వెంటవెంటనే జరిగిపోతున్నాయి. ఇప్పటికే మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ ను పూర్తిగా బోర్డు నుంచి తప్పించేసిన శశాంక్, తాజాగా భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పైనా దృష్టి సారించారు. గతేడాది బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ డిసెంబర్ లో ఇరు దేశాల జట్ల మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అయితే సరిహద్దులో తరచూ నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమాదంలో పడిపోయింది. మొన్నటికి మొన్న బీసీసీఐతో చర్చలు జరిపేందుకు ముంబై వచ్చిన పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగడం దుర్లభమేనన్న వాదనా వినిపించింది. అయితే ఈ విషయంలో శశాంక్ మనోహర్ నిన్న కీలక అడుగేశారు. భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ కు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే, ఈ ఏడాడి డిసెంబర్ 15 నుంచి ఇరు దేశాల జట్ల మధ్య క్రికెట్ సిరీస్ మొదలు కానుంది. డిసెంబర్ 15న మొదలు కానున్న ఈ సిరీస్ జనవరి 7 దాకా కొనసాగనుంది. ఇందులో ఐదు వన్డేలతో పాటు రెండు టీ20 మ్యాచ్ లు కూడా ఉండే అవకాశముంది.

  • Loading...

More Telugu News