: హిందూ యువతిని పెళ్లాడిన జూనియర్ ‘బుఖారీ’... ఆసక్తి రేపుతున్న వివాహం
దేశంలో ముస్లిం జనాభాకు మత పెద్ద హోదాలో ఉన్న ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ కుమారుడు ఓ హిందూ యువతిని పెళ్లాడారు. రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తూ వస్తున్న ఆ దంపతుల పెళ్లికి షాహీ ఇమామ్ మతాలను పక్కకు పెట్టేసి పచ్చజెండా ఊపేశారు. వివరాల్లోకెళితే... దేశ రాజధానిలోని జామా మసీదు షాహీ ఇమామ్ గా సయ్యద్ అహ్మద్ బుఖారీ పనిచేస్తున్నారు. దేశంలోని ముస్లింలందరికీ ఈయన చెప్పిందే వేదం. ఇంతటి స్థానంలో ఉన్న ఆయన ఓ హిందూ యువతిని పెళ్లాడేందుకు తన కుమారుడికి అనుమతి ఇచ్చేశారు. బుఖారీ కుమారుడు షబన్ బుఖారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ హిందూ యువతితో ప్రేమలో పడ్డారు. రెండేళ్లుగా వీరు సహజీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలిపిన షబన్, తాను ప్రేమించిన హిందూ యువతినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పారు. అయితే, సీనియర్ బుఖారీ తొలుత ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరిస్తానని సదరు హిందూ యువతి సమ్మతి తెలపడంతో ఎట్టకేలకు బుఖారీ ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఆదివారం జామా మసీదులోనే ఈ పెళ్లి జరిగింది. సీనియర్ బుఖారీ సమక్షంలోనే జూనియర్ బుఖారీ హిందూ యువతిని పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు బుఖారీ, యువతి తరఫు కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు.