: ఏపీ బడ్జెట్ రూపకల్పన కసరత్తు షురూ!... పీవీ రమేశ్ బృందంతో యనమల భేటీ
నవ్యాంధ్రప్రదేశ్ రెండో వార్షిక బడ్జెట్ రూపకల్పన మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తొలుత ఇంటెరిమ్ బడ్జెట్ తో నెట్టుకువచ్చిన ఏపీ, ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వచ్చే మార్చి 31తో 2015-16 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆ లోగానే కొత్త బడ్జెట్ రూపొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ (2016-17) రూపకల్పనకు ఏపీ ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ నేతృత్వంలోని ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ప్రాధమ్యాలను ఆయన అధికారులకు వివరించినట్లు సమాచారం. మంత్రి సూచనలతో పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరలోనే బడ్జెట్ రూపకల్పనకు పూనుకోనున్నారు.