: చిత్తూరు జిల్లాలో ‘రేవాను’ బీభత్సం... జలదిగ్బంధంలో తిరుపతి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేవాను తుపానుగా రూపాంతంరం చెందింది. ఇప్పటికే తమిళనాడు సహా పుదుచ్ఛేరిని అతలాకుతలం చేసిన రేవాను తాజాగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను చుట్టుముట్టింది. రేవాను ప్రభావం కారణంగా నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని జలాశయాలకు గండ్లు పడ్డాయి. దీంతో ఆయా జలాశయాల సమీపంలోని జనావాసాలు నీట మునిగాయి. ఇక జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను కూడా రేవాను ముట్టడించింది. వర్షం కారణంగా తిరుమల రెండు ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ ను నిషేధించిన అధికారులు నేటి ఉదయం ట్రాఫిక్ ను పునరుద్ధరించినా, ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లింకు రోడ్డు ద్వారా వాహనాలు వెళుతున్నాయి. తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది.