: రాజధాని కోసం... ఒక్కరోజులో లక్షకుపైగా 'ఈ-ఇటుకల' కొనుగోలుకు శ్రీకారం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ఒక్క రోజులో లక్షకు పైగా ఈ-ఇటుకలను కొనుగోలు చేసి గిన్నీస్ రికార్డుకెక్కే కార్యక్రమానికి విజయవాడలో శ్రీకారం చుట్టారు. 'మన ఇటుక-మన అమరావతి'లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని నాని తన కార్యాలయంలో ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ ద్వారా ఇటుకలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరూ అధిగమించకుండా కార్యక్రమం జరగాలని నాని పేర్కొన్నారు. ఈ ఉదయం ప్రారంభమైన ఇటుక విక్రయాలు రేపు ఉదయం9 గంటల వరకు కొనసాగుతాయి. విజయవాడలోని అన్ని డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇటుకల కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లక్షన్నరకు పైగా ఈ-ఇటుకలను కొనుగోలు చేయించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని 59 మంది డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు వారం రోజుల నుంచి ఇటుకలను కొనుగోలు చేయించే వారిని సిద్ధం చేస్తున్నారు. కాగా, చైనా దేశానికి సంబంధించి విరాళాల విషయంలో 1.10 లక్షల రికార్డు ఉంది. దానిని మించాలంటే 1.11 లక్షలకు కొనుగోలు చేరుకుంటే రికార్డు మనదే అవుతుంది.