: ‘సీమ’ను చుట్టేస్తున్న చంద్రబాబు... నేడు ‘అనంత’లో ఏసీ సీఎం పర్యటన
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాయలసీమను చుట్టేస్తున్నారు. నిన్న హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గోరుకల్లులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వెళ్లారు. జిల్లాలోని గండికోట ప్రాజెక్టును పరిశీలించిన ఆయన అక్కడే రాత్రి ‘ప్రాజెక్టు నిద్ర’లో భాగంగా అక్కడే ఆయన బస చేశారు. నేటి ఉదయం గండికోట నుంచి మరో ‘సీమ’ జిల్లా అనంతపురం బయలుదేరారు. అనంతపురంలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 2014-15 బ్యాచ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత హంద్రీ-నీవా ప్రాజెక్టును పరిశీలిస్తారు. నేటితో రాయలసీమ పర్యటనకు కాస్త బ్రేక్ ఇవ్వనున్న చంద్రబాబు ఈ నెల 13న తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటిస్తారు. తిరుపతిలో జరగనున్న టీడీపీ ఏపీ శాఖ రాష్ట్రస్థాయి సమావేశాలను పురస్కరించుకుని రెండు రోజుల పాటు ఆయన చిత్తూరు జిల్లాలోనే ఉండనున్నారు.