: అరుణ్ శౌరీ...నీ కొడుకు పిచ్చి ఇంకా ముదురుతుంది!: బీజేపీ మద్దతుదారుల ట్వీట్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరమైన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు, నాయకులు, నేతలు కొంతమంది బాహాటంగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది మీడియా ముందు... మరికొంత మంది సామాజిక మాధ్యమాల్లోను తమ ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, ఘాటు విమర్శలూ చేశారు. వినడానికి ఒకింత కష్టమైన పదజాలాన్నే కొందరు ప్రయోగించారు. బీహార్ లో బీజేపీ ఓటమికి కారకులైన వారిపై విమర్శలు చేసినా చెల్లుతుంది. కానీ, అభంశుభం తెలియని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ కుమారుడు, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న అతనిపై కూడా నెట్ లో విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల ఛానల్ లో ఆయన ప్రస్తావించారు. ‘ఇస్కా మెంటల్ సన్ హై, వో ఔర్ భీ మెంటల్ బనేగా’ అంటూ తన హ్యాండీక్యాప్డ్ కొడుకుపై సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. ‘ప్రధాని నరేంద్ర మోదీని అనుసరించేది ఇటువంటి వాళ్లా?’ అంటూ అరుణ్ శౌరీ ఆగ్రహించారు. కాగా, గతంలో మోదీని అరుణ్ శౌరీ విపరీతంగా అభిమానించారు. కాల క్రమంలో ఆయన మోదీపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.