: మావోలపై జార్ఖండ్ పోలీసుల సినిమా... అసలు పోలీసు అధికారులు కూడా నటించారు!
ఇప్పటివరకు మావోయిస్టుల కథతో పలువురు దర్శకులు సినిమాలు రూపొందించడం చూశాం. కానీ దేశంలోని మావోయిస్టుల్లో సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు జార్ఖండ్ పోలీసులే ముందుకొచ్చి తాజాగా సినిమా నిర్మించారు. ఇందులో దాదాపు 12 మంది అసలైన పోలీసు అధికారులే నటించడం విశేషంగా చెప్పుకోవాలి. 'ప్రత్యవర్తన్' (హోం కమింగ్-ట్యాగ్) టైటిల్ లో ఈ చిత్రం తెరకెక్కింది. జార్ఖండ్ కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ ఇందులో డీజీపీగా నటించారు. నిమూ భౌమిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు షాన్ పాటలు పాడారు. శ్రీల మజుందార్, మౌసమీ భట్టాచార్య, ఇషాన్, సైకత్ ఛటర్జీ తదితరులు కూడా నటించారు. రాంచీలోని స్థానిక మల్టీఫ్లెక్స్ లో ఇటీవలే ఈ చిత్రం ప్రీమియర్ జరిగింది. ఈ నెల 13న దీనిని విడుదల చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతం నుంచి మావోలు గాడి తప్పుతున్నారని భావిస్తున్న ఓ మావోయిస్టు జోనల్ కమాండర్ జీవితం చుట్టూ ఈ చిత్రం కథ నడుస్తుంది. ఇందులో మరో విశేషమేంటంటే, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓ ప్రేమ కథను కూడా పెట్టారు. ఓ మావోయిస్టు యువకుడు అత్యాచారానికి గురవుతున్న ఓ అమ్మాయిని రక్షించి ఆమెకు దగ్గరవుతాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నాయకుల అంచనాలకు, ప్రేమకు మధ్య నలిగిపోయే అంశాన్ని ఇందులో చూపుతారు.