: అతనో బార్బర్... ఇప్పుడు 200 కార్లకు ఓనర్!
ఓ బార్బర్ దగ్గర 200 కార్లు ఉన్నాయంటే నమ్మగలరా? నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఇందులో బీఎంబ్ల్యూ, రోల్స్ రాయిస్, బెంజ్, రేంజ్ రోవర్ వంటి అత్యంత విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన రమేశ్ వృత్తిరీత్యా బార్బర్...చేసేది జుట్టు కత్తిరించడం అయినా, 'సింగపూర్ కటింగ్ వేయాలంటే ఆయనే వేయాలి' అన్నంత ఫేమస్. పలువురు వీఐపీలు ఆయన దగ్గరే క్షవరం చేయించుకుంటారు. ఇక, మన రమేశ్ కి చిన్నప్పటి నుంచి కార్లంటే మహా మోజు. ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేసిన రమేష్ మొదట్లో ఓ కారును కొన్నాడు. కొన్నాళ్లు వాడిన తరువాత దానిని పక్కన పెడితే అది దుమ్ముపట్టడం మొదలు పెట్టింది. దీంతో దానిని ఎలాగూ వాడడం లేదు, కనీసం అద్దెకన్నా ఇవ్వు అని ఇంట్లో వాళ్లు సలహా ఇచ్చారు. ఆ సలహాను అనుసరించిన రమేశ్ దానిని అద్దెకివ్వడం ప్రారంభించాడు. ఇలా 2004లో అద్దె కార్ల సంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు అతని దగ్గర 200 కార్లు ఉన్నాయి. తన దగ్గరున్న బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ లాంటి కార్లను అమితాబ్, షారూఖ్, సల్మాన్ లాంటి వారు కూడా అద్దెకు తీసుకెళ్తారని రమేశ్ చెబుతున్నారు.