: బీహార్ ఎన్నికలు నేర్పుతున్న నీతి పాఠాలు ఇవే!
గత సంవత్సరం ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన భంగపాటు కాకతాళీయం కాదని తేలిపోయింది. నిన్నటి బీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీ డైనమిక్ దిగ్గజాలు నరేంద్ర మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని నిరూపించింది. బీజేపీ మారాల్సిన అవసరాన్ని, మంత్రులు ఏ వర్గం వారినీ టార్గెట్ చేసి మాట్లాడకుండా చూడాల్సిన సంకేతాలను బీజేపీకి పంపింది. మత రాజకీయాలు ఎప్పుడూ ప్రయోజనాలను దగ్గర చేయబోవని తేల్చి చెప్పింది. మరెన్నో నీతి సూత్రాలను గుర్తు చేసింది. ప్రచారంతో మాత్రమే యుద్ధాన్ని గెలవలేరు: నేతలు రావడం, వాగ్దానాల వర్షం కురిపించడం, ఆపై వెళ్లిపోయి, వాటిని మరవడం. ఇండియాలో సామాన్యుడు నేతల ప్రసంగాలతో అలసిపోయాడు. ఇప్పుడు ఓటరుకు కావాల్సింది స్లోగన్లు కాదు. ఫలితాలు. విభజన రాజకీయాలతో పరాజయమే: ఓటర్లను విభజించి పబ్బం గడుపుకోవాలంటే పరాజయం ఎదురవుతుందని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఆవు పేరు పదే పదే చెప్పి హిందువుల ఓట్లు కొల్లగొట్టాలని భావించిన బీజేపీ, అందులో ఏ మాత్రమూ విజయం సాధించలేకపోగా, అదే సమయంలో ముస్లిం ఓటర్లు మరింతగా దూరమయ్యారు. అభివృద్ధే గెలుపు మంత్రం: వాస్తవానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అయినా అదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారంటే, ఎంతో కొంత అభివృద్ధి ప్రతి ఒక్కరి కళ్లకూ కనిపించినట్టే! ఆ అభిప్రాయం ప్రజల్లో ఉన్నంతకాలం, మరే ఇతర పార్టీ కూడా వారిని ఓడించలేదు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఇది దశాబ్దాల కాలం కనిపించింది. వెనకుండే వ్యూహకర్తలూ ముఖ్యమే: కేవలం ప్రచారంతోనే విజయం సాధించలేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటరుకు, ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కు సంపాదించుకున్న యువతకు దగ్గర కావడం తప్పనిసరి. ఇందుకు సామాజిక మాధ్యమాలను ఎలా వాడుకున్నారన్నది కీలకం. నాడు మోదీకి సహకరించిన ఓ టెక్కీ మేధస్సు, నేడు నితీష్ వైపు నిలిచింది. బీజేపీ ఓటమికి ఇది కూడా కారణమే. ప్రజల ఆలోచనా విధానమూ మారుతుంది: దేశ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి మద్దతిచ్చిన భారత ప్రజలు, రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. ఇక స్థానిక ఎన్నికల విషయానికి వస్తే, తమ సమస్యలే వారికి గుర్తుంటాయి. దీన్ని మరస్తే పరాజయం తప్పదు. ఇక బీహార్ ఎన్నికలు చెబుతున్న ఈ నీతి పాఠాలను బీజేపీ నేర్చుకోకుంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి ముంగిట కూర్చోక తప్పకపోవచ్చు.