: నేనూ రాయలసీమవాడినే... ప్రాణం ఉండగా సీమకు అన్యాయం జరగనివ్వను: చంద్రబాబు


రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటూ కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా సీమకు అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. అసలు సీమ వెనుకబాటుకు స్థానిక నేతలే కారణమని దుయ్యబట్టారు. కొందరు కావాలనే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వపరంగా తప్పులుంటే సరిచేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ పలువురు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీఎం ఈ మేరకు స్పందించారు. ఈరోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, తాను రాయలసీమకు చెందిన వాడిని కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే తాను ఇక్కడే మకాం వేస్తానన్నారు. అవసరమైతే బస్సులో పడుకుని తిష్ట వేస్తానని చెప్పారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News