: భగవత్ తో అమిత్ షా భేటీ... బీహార్ పరాభవంపై సమాలోచనలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తల బొప్పి కట్టిన బీజేపీ పరాభవానికి గల కారణాలపై అంతర్మథనంలో మునిగిపోయింది. నేడు పార్టీ పార్లమెంటరీ కమిటీ కీలక భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి పార్టీ కీలక నేతలంతా హాజరుకానున్నారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం పార్టీ సిద్ధాంత కర్త హోదాలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ భేటీ దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగనుంది. బీహార్ బరిలో ఓటమిపై అటు విపక్షాల నుంచే కాక, ఇటు స్వపక్షం నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భగవత్ తో అమిత్ షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటమిపై సొంత పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా, ఈ విషయాన్ని భగవత్ వద్ద ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అంతేకాక నేతలను అదుపు చేసే విషయంపైనా వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే భగవత్ వద్దకు అమిత్ షా వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాక నితీశ్ కు జనంలో ఉన్న పాజిటివ్ ఇమేజ్ ను దెబ్బతీసే క్రమంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి నష్టం కలిగించాయన్న ప్రచారం కూడా ఈ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం.