: బీజేపీ ఓటమితో స్టాక్ మార్కెట్లకు నష్టం ఎలాగంటే..!


ముందుగా ఊహించినట్టే సోమవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్ కుదేలైంది. బీహార్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి ఓటమిపాలు కావడం మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఫలితంగా సెషన్ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఆపై కాస్త తేరుకుని 10:45 గంటల సమయంలో 325 పాయింట్ల నష్టంలో ఉంది. బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తే, పలు కీలక బిల్లులు, సంస్కరణల అమలుకు మార్గం సుగమమవుతుందని పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. బీజేపీ ఘోర పరాభవంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నుంచి బీమా సంస్కరణలు, భూసేకరణ, వివిధ రంగాల్లో ఎఫ్డీఐ పెంపు వంటి ముఖ్యమైన బిల్లులిప్పుడు విపక్షాల నుంచి మరింత అడ్డంకులను ఎదుర్కోనున్నాయి. మరోవైపు 'మేకిన్ ఇండియా' అంటూ మోదీ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ప్రచారం అనంతరం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం బీహార్ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. వీరంతా ఇప్పుడు దేశానికి ఇన్వెస్ట్ మెంట్స్ తేవాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో గెలిచి, ఆ రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీకి చుక్కెదురు కావడం కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీసింది. అందువల్లే ఈ సెషన్లో కొత్త ఈక్విటీల కొనుగోలు కన్నా, లాభాల స్వీకరణ వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని, అయితే, భారీ పతనం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News