: నేడు ధన త్రయోదశి, లక్ష్మీదేవి కరుణ ఎలా పొందాలంటే...!


జీవితంలో డబ్బు సంపాదించాలని, ధనలక్ష్మి కరుణా, కటాక్షాలను పొందాలని ఎవరికి ఉండదు? పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. భువిపైకి వచ్చిన ధనలక్ష్మి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? తనను భక్తులు ఎలా పూజించాలని లక్ష్మీదేవి కోరుకుంటుందో తెలుసుకుందాం. మీకు శ్రీవెంకటేశ్వరుని అవతార కథ తెలుసుగా? కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణునివాసమైన వైకుంఠానికి వెళతాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ, విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై, శ్రీహరి వక్షస్థలాన్ని తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ, కాళ్లు పట్టుకుని, ఆపై భృగువుకు అరికాలులో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (అది నేటి కొల్హాపూర్) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి, లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ధన త్రయోదశి అయింది. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. నేడు శుచిగా స్నానాదులు ముగించిన తరువాత, ఏమీలేని పేదలకు భోజనమో, వస్త్రమో, రొక్కమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుందీ పండగ. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారమంటి మనసుతో అర్చించినా ఆ తల్లి కరుణిస్తుంది.

  • Loading...

More Telugu News