: బీహార్ విషయంలోనూ నిజమైన ‘ఆంధ్రా అక్టోపస్’ జోస్యం!


ఎక్కడ ఎన్నికలు జరిగినా, సదరు ఎన్నికల ఫలితాల కోసం తెలుగు ప్రజలు ‘ఆంధ్రా ఆక్టోపస్’ సర్వే కోసం ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఇప్పటిదాకా ‘ఆక్టోపస్’ సర్వేలన్నీ దాదాపుగా నిజమయ్యాయి. ఇంతకీ ఆ ‘ఆక్టోపస్’ ఎవరనేగా మీ అనుమానం? ఇంకెవరండీ బాబూ... విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాలే! తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలపై లగడపాటి సర్వేలు దాదాపుగా వాస్తవమేనని తేలాయి. ఈ నేపథ్యంలో లగడపాటి తన సర్వే యంత్రాంగాన్ని బీహార్ లోనూ దింపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 'ఆర్జీ ప్లాష్ టీమ్’ ఆధ్వర్యంలో ఆయన బీహార్ బరిపై సర్వే చేయించారు. బీహార్ లో నితీశ్, లాలూ ప్రసాద్ యాదవ్ ల నేతృత్వంలోని మహా కూటమి విజయం సాధించి తీరుతుందని సదరు సర్వే మొన్న జోస్యం చెప్పింది. ‘ఆక్టోపస్’ సర్వే పేర్కొన్నట్లుగానే నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీకి షాకిస్తూ మహా కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ‘ఆంధ్రా ఆక్టోపస్’ సర్వే నిజమైందంటూ తెలుగు మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో నిన్న న్యూఢిల్లీలో లగడపాటి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన సర్వేలో మహా కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని తేలిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో మహా కూటమి సీట్ల సంఖ్యను కాస్తంత తక్కువ చేసి చూపామని ఆయన పేర్కొన్నారు. జనంలోని మోదీ హవాను ఓట్ల రూపంగా మలచుకోవడంలో విఫలమైన కారణంగానే బీజేపీకి ఘోర పరాభవం ఎదురైందని లగడపాటి తెలిపారు. అదే సమయంలో నితీశ్ కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ ను దెబ్బతీయాలన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ యత్నాలు కూడా మహా కూటమికి లాభించాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News