: బంగాళాఖాతంలో వాయుగుండం... తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా తమిళనాడు సహా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై, పాండిచ్చేరిలకు వాయవ్య దిశగా వరుసగా 400, 390 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రేపు రాత్రి 11.30 గంటలకు పుదుచ్చేరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో తీరం వెంట 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో చేపల వేటను నిషేధించారు. వాయుగుండం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు రాజధాని సహా, ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో రేపు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీరం వెంట కంట్రోల్ రూంలు ఏర్పాటయ్యాయి. నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.