: ‘కూటమి’లోనే కాదు, అసెంబ్లీలోనే అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ!
తన చతురోక్తులతో, మాటలతో అవతలి వ్యక్తిని అట్టే నవ్వించగలిగే నేత, మారుమాట్లాడకుండా చేయగలిగే నేత రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ సుమారు పదిహేనేళ్లుగా ఆ రాష్ట్రంలో అధికారంలో లేదు. ఎన్నేళ్లు తాను అధికారంలో లేకపోయినా బీహారీలు ఆయన్ని మర్చిపోలేదని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నికల్లో ఆయనకు గెలుపొందిన స్థానాలే. బీహార్ లోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు 243. వాటిలో 80 స్థానాల్లో ఆర్జేడీ గెలుపు సాధించింది. దీంతో ఏకంగా మహా కూటమిలోనే కాకుండా అసెంబ్లీలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్జేడీ తర్వాత జేడీ(యు) 69 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను సాధించాయి. అసలైన బీహారిని తానేనని, ప్రజలు తనను నమ్ముతారని, బయటవారిని (బహారీలని) వారు నమ్మరంటూ తన ప్రచారంలో పదేపదే చెప్పిన లాలూకు ఆ రాష్ట్ర ప్రజలు దీపావళి కానుకగా ఈ విజయాన్ని కట్టబెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.