: బీహార్ ఎన్నికల ఫలితాలు నేడే... మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మొత్తం ఐదు దశల్లో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి... అధికార జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల ఉమ్మడి 'మహా కూటమి' మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ముగిసే అవకాశాలున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.., కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివన్న ప్రచారం కూడా సాగింది. అంతేకాక ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్తును నిర్దేశించనున్నాయన్న కోణంలోనూ వాదోపవాదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో నేడు వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.